12-09-2025 11:35:09 PM
కరీంనగర్,(విజయక్రాంతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినం, ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను మూసీకి తరలిస్తున్నం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇంత కంటే దిక్కుమాలిన అబద్దం మరొకటి ఉండదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసినా, వినియోగంలోకి టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఎల్లంపల్లి ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా 2004లో 3,177 కోట్లతో చేపట్టారని, తెలంగాణ వచ్చేనాటికి ప్రాజెక్టుపై 3,347.27 కోట్లు ఖర్చుపెట్టారని, మొత్తంగా 20.16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌లో తెలంగాణ ఏర్పడేనాటికి ఏనాడూ 5 టీఎంసీలకు మించి జలాలను నిల్వ చేయలేదని అన్నారు.
భూసేకరణ పూర్తి చేయకపోవటం, ముంపు బాధితులకు పునరావాసం కల్పించకపోవడమని, అక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా అది పూర్తి చేయలేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో రూ.2,052.73 కోట్లను వాటి కోసం వెచ్చించిందని, బరాజ్‌ను 2016లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చిందన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మిడ్ మానేరు మీద 1586 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నీళ్లు నింపింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.