13-09-2025 12:35:17 AM
-పాతాళానికి పడిపోయిన ధరలు
-ఉత్తరాదిలో భారీ వర్షాలే కారణమా..
-మార్కెట్ ఉన్నా.. ప్రయోజనం సున్నా..
-టన్ను రూ.45 వేలు పలకాల్సింది..
-ప్రస్తుతం టన్ను రూ.10వేలే..
నల్లగొండ, సెప్టెంబరు 10(విజయక్రాంతి): బత్తాయి రైతు బోరుమంటున్నారు. ఒకప్పటి వరకు బత్తాయి తోటల సాగుకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు ఆ తోటల సాగు కనుమరగవుతోంది. పాలకుల నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ రోజురోజూకీ బత్తాయి రైతుకు భరోసా లేకుండాపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బత్తాయి మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక బత్తాయి దిగుబడుల క్రయవిక్రయాలు ముందుకు సాగడం లేదు. అసలే చీడపీడల దెబ్బకు దిగుబడి తగ్గి విలవిలలాడిపోయిన రైతాంగం కనీస మద్దతు ధర లేక అపసోపాలు పడుతున్నారు. బత్తాయి తోటల సాగు కోసం రూ.లక్షల పెట్టుబడి పెడితే.. కనీసం రవాణ ఛార్జీలు దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బత్తాయి రైతాంగంపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.
కనుమరుగవుతోన్న బత్తాయి తోటలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బత్తాయి రైతుల పేరు మారుమోగింది. కానీ ఇదంతా ఘనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటలను 3.50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కానీ ప్రస్తుతం ఆ తోటల విస్తీర్ణం 65వేల ఎకరాలకు పడిపోయింది. బత్తాయి పంటల దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రధానంగా నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల్లో బత్తాయి తోటలను విపరీతంగా సాగు చేశారు. కానీ బత్తాయి దిగుబడులకు ఆశించిన ధర దక్కకపోవడంతో భారీస్థాయిలో రైతులు బత్తాయి తోటలను పీకేశారు. గత రెండు సంవత్సరాల కాలంలోనే 50 వేల ఎకరాలకు పైగా తోటలను తొలగించి.. ఇతర పంటలను సాగు చేస్తుండడం గమనార్హం.
రూ.45వేల నుంచి రూ.10వేలకు ధర..
బత్తాయి దిగుబడులకు గతంలో మంచి ధర పలికింది. సాధారణంగా సెప్టెంబరు మాసంలో టన్ను బత్తాయి రూ.35 వేల నుంచి రూ.45వేలకు పైగా పలుకుతుంది. కానీ ప్రస్తుతం టన్ను బత్తాయి రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం బత్తాయికి మంచి సీజన్ అని చెప్పాలి. సీజనులో టన్ను బత్తాయికి ఏటూ లేదన్న రూ.30వేల నుంచి రూ.40 వేలు పలుకుతుంది. కానీ ప్రస్తుతం రూ.10వేలకు మించి రైతులకు ధర దక్కకపోవడం వల్ల రైతులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం బత్తాయి ఏరేందుకు వచ్చిన కూలీల ఖర్చు, రవాణ ఖర్చులకు సరిపోవట్లేదు. ఉన్నట్టుండీ పాతాళానికి పడిపోవడం వెనుక అసలు కారణమెంటో అంతుచిక్కడం లేదు.
దెబ్బతీసిన భారీ వర్షాలు, తెగుళ్లు..
నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బత్తాయి దిగుబడులు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలకు వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాలకు బత్తాయి ఎగుమతులు మందగించాయి. దీంతో బత్తాయి దిగుబడులపై భారీగా ఎఫెక్ట్ పడింది. గతంలో బత్తా యి సీజనులో పంట ముందుగా వచ్చిన రైతులు త్వరగా అమ్ముకోవడంతో వారందరూ కొంతమేర కష్టాల నుంచి గట్టెక్కారు. కానీ గత కొద్దీరోజులుగా టన్ను బత్తాయి రూ.10వేలు దాటకపోతుండడం .. పెట్టుబడి ఖర్చులకు తోడు బత్తాయి సేకరణ ఆర్థిక భారం రైతులపైనే పడుతోంది.
దీంతో కొంతమంది రైతులు తోటల్లోనే పంట దిగుబడు లను కోయకుండా వదిలేస్తున్నారు. దీనికితోడు ఇప్పటికు బత్తాయి పంట తెగుళ్ల బారి న పడి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఇదిలావుంటే.. నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బత్తాయి మార్కెట్ నిరుపయోగంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కొనుగోళ్లు, అమ్మకాలు సాఫీగా సాగడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బత్తాయి పంటకు తగిన ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.