23-12-2025 05:19:13 PM
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు
మానకొండూరు,(విజయక్రాంతి): గత రెండేళ్లలో ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీని మరచిపోయారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ పదేపదే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హైడ్రా, మూసి ఆక్రమణ కూల్చివేతలు, బనకచర్ల భూసేకరణ తదితర వైఫల్యాలపై అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని రామకృష్ణారావు తేల్చి చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు, పింఛన్లు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుదల లాంటి అంశాలను, కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం వారి రాజకీయ ఆపరిపక్వతకు నిదర్శనమన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరులోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శ్రీనివాస్ నగర్ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, శాతరాజు యాదగిరి తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడారు.
కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు శాసనసభలొ సమాధానం చెబుతామనడం వారి అవివేకానికి, అసహనానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా, వారి జాగీరా అని మీడియా సాక్షిగా నిలదీశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి ,మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, హరితహారం, వైద్య కళాశాల మంజూరు, తదితర పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించకపోవడం వారి రాజకీయ అవగాహన లేమికి నిలువెత్తు సాక్ష్యమని వ్యాఖ్యనించారు.