23-12-2025 06:21:01 PM
-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్
-సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు
హుజూర్ నగర్: కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరులోని జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రను అవమానించడమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్,సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసి గాంధీ పార్క్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలపై దాడి చేయడం పరిపాటిగా మారిందన్నారు.
గ్రామీణ పేదల హక్కులకి విఘాతం కలిగించేలా ఉపాధి హామీ పథకం మార్పులు చేయడం తగదన్నారు. దేశ ప్రజల పక్షాన పోరాడిన మహాత్ముడి పేరు తొలగించడం రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయం తప్ప దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన మార్పులను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే ప్రజా ఉద్యమాలతో తగిన గుణపాఠం నేర్పుతామని తీవ్రంగా హెచ్చరించారు.
పేర్లు మార్పు చేసినంత మాత్రాన చరిత్రను సత్యాన్ని ప్రజల నుండి వేరు చేయలేరన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరం మల్లేశ్వరి,దొంతగాని సత్య నారాయణ,జడ శ్రీనివాస్, మామిడి వెంకయ్య,సోమగాని కృష్ణ, కందుల వెంకటేశ్వర్లు, కొప్పోజు సూర్య నారాయణ, గుండా రమేష్, యల్లావుల ఉమా, సుందరి పద్మ,పొనుగుపాటి వాసుదేవరావు, శ్యామ్ సన్,బత్తిని మల్లయ్య, తదితరులు, పాల్గొన్నారు.