06-05-2025 12:45:03 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సోమవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పలువురు బీఆర్‌ఎస్ నేతలు గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు వణుకుడు మొదలైందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెసోళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, విమర్శల దాడికి తాళలేక బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఫేక్ పేపర్లు, పెయిడ్ బ్యాచులతో పేజీలు పెట్టించి మరీ దాడికి పాల్పడు తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారంతో బీఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. అలాంటి అసత్య ప్రచారంపై చట్టప రమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను కోరామన్నారు. ఎమ్మెల్సీ వెంట పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి తదితరులున్నారు.