27-12-2025 06:30:13 PM
వార్డు డీలిమిటేషన్‌పై వినతి
పటాన్ చెరు: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ గారిని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆధర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కలిసి జీహెచ్ఎంసీ వార్డు డీలిమిటేషన్ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులను వివరిస్తూ మూడు ముఖ్య వినతిపత్రాలను పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అధికారికంగా కమిషనర్‌కు సమర్పించారు. ప్రస్తుతం ఉన్న అమీన్‌పూర్ సర్కిల్ పేరును సరిపడా మౌలిక వసతులతో పాటు ప్రధాన రహదారిపై ఉన్న, సులభంగా చేరుకునే రామచంద్రపురం సర్కిల్‌గా మార్చాలని కోరారు. అక్కడ ఉన్న ఎంపీడిఓ కార్యాలయంలో తగిన స్థలం కూడా అందుబాటులో ఉందని, ముఖ్యంగా డివిజన్‌లోని వృద్ధులకు అమీన్‌పూర్‌కు వెళ్లడం చాలా కష్టంగా మారనుంది అని వివరించారు.
అలాగే భౌగోళికంగా తెల్లాపూర్‌కు సమీపంలో ఉన్న వేలిమల గ్రామాన్ని పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని వినతిచేశారు. గతంలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో భాగంగా ఉన్న విద్యుత్‌నగర్ కాలనీ ప్రస్తుతం తెల్లాపూర్, భారతి నగర్ డివిజన్లుగా విడిపోయి ఉండటంతో పరిపాలనా, మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తుతున్నాయని, కావున మొత్తం విద్యుత్‌నగర్ కాలనీని తెల్లాపూర్ డివిజన్‌లో చేర్చాలని కోరారు.
ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ తొంట ఆంజయ్య, కుమార్ గౌడ్, తెల్లాపూర్ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, బీఆర్‌ఎస్‌వీ కోఆర్డినేటర్ చిన్నా, శ్రీకాంత్ రెడ్డి, అప్పల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.