27-12-2025 06:33:09 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శని వారం కలెక్టరేట్ ముందు ప్లా కార్డులతో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 23 వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందన్నారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని.. ఇప్పుడు అది రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండల స్థాయిలలో మాత్రమే కార్డులివ్వాలని నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడీ కోటాను రద్దుచేసి, ఫ్రీలాన్స్ కోటాలో, అదీ కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండలస్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తారని ఆ జీవోలో పేర్కొనటం సరికాదన్నారు. కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారు.
ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పై 'అక్రెడిటేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనటం సరికాదన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటి కాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్షసాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రెడిటేషన్ రూల్స్ ఫ్రేం చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ జీవోను సవరిచాంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (TUWJ) H-143 జిల్లా అధ్యక్షుడు ఉమేశ్, కో కన్వీనర్లు చెట్ల రమేష్, రేణుకుంట్ల శ్రీనివాస్ నాయకులు సిద్ధార్థ, కుమార్, అంబిలపు శ్రీనివాస్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) నేషనల్ కౌన్సిల్ మెంబర్ ముత్యం వెంకట స్వామి, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి కల్వల అరుణ్ కుమార్, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్, కానవేని ఓదెలు, డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ (వర్కింగ్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తంగళ్ళపల్లి అరుణ్ కుమార్, పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా కు చెందిన జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.