27-12-2025 07:15:44 PM
పాత కమిటీ అధ్యక్షులను పదవీకాలం ముగుస్తోంది..
జనవరి మొదటి వారంలో కొత్త వాళ్ళని నియమిస్తాం..
పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం చేస్తాం...
రాష్ట్ర మత్స కార్పొరేషన్ చైర్మన్, వనపర్తి జిల్లా పరిశీలకులు మెట్టు సాయి కుమార్
వనపర్తి టౌన్: కాంగ్రెస్ పార్టీ కోసం గడిచిన పదేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తూ గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు ఎదుర్కొని, అనేక హింసలకు గురికాబడిన కార్యకర్తలకు ఊరట కలుగుతుందని పార్టీ జెండాను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు 90% న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మత్స కార్పొరేషన్ చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు మెట్టు సాయికుమార్ అన్నారు.
శనివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నియమించిన కాంగ్రెస్ పార్టీ కమిటీలు (గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఉన్న అధ్యక్షులను) ఎస్సీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల, కార్మిక, వ్యవసాయ పలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు పదవీకాలం దగ్గర పడడంతో వారి పదవులు రద్దవుతున్నట్లు ఆయన తెలిపారు.
త్వరలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మంత్రుల, ఎమ్మెల్యేల, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సమక్షంలో వారి పదవుల స్థానంలో జనవరి మొదటి వారంలో ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలను ఎన్నుకొని వారికి పదవులు ఇస్తామన్నారు. పదవులు కొన్నే ఉంటాయని ఆశించే వాళ్ళు చాలే ఉంటారని, నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడు వారి స్థానం పదిలంగా ఉంటుందన్నారు. చాలా మటుకు కాంగ్రెస్ పార్టీలో పైరవీల వ్యవస్థ ఉండదన్నారు.
క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. అధిష్టానం ఏది చెప్పిన రాజ్యాంగబద్ధంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, బీసీ ,మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది తప్ప... స్వలాభాల కోసం పనిచేయదు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ పోరులేదని పనిచేసే వాళ్ళందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని హితువు పలికారు.