calender_icon.png 27 December, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండాలి

27-12-2025 08:05:28 PM

రైతులకు ఇబ్బందులు ఏర్పడితే అధికారులదే బాధ్యత

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఖానాపూర్ లో ఎరువుల గిడ్డంగి ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్ లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రతి సొసైటీకి ఎరువులను చేరవేస్తూ, రైతులకు పంపిణీ జరిగేలా కృషి చేయాలన్నారు. 

ఖానాపూర్ లోని ఎరువుల గిడ్డంగిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి, స్టాక్ వివరాల రిజిస్టర్ లో పొందుపరచిన వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఇప్పటివరకు జిల్లాకు ఈ సీజన్ లో వచ్చిన ఎరువుల నిల్వలు ఎన్ని, ఇంకనూ ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా ఎరువుల కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కోసం ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు క్యూ లైన్ లలో నిలబడడం వంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా, ముందుగానే వారికి రెండు విడతలకు సరిపడా ఎరువుల బస్తాలను సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు.

ఎరువుల కేటాయింపులు, పంపిణీ ప్రక్రియలను ప్రతి రోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నెలకొని ఉంటే పరస్పర సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని వ్యవసాయ, మార్క్ ఫెడ్, సహకార శాఖల అధికారులకు హితవు పలికారు. ఎరువుల పంపిణీ తీరుతెన్నులపై ప్రతి రోజు తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. నిల్వలు మిగిలి ఉన్నప్పుడే సొసైటీల ద్వారా ఇండెంట్ పెట్టి స్టాక్ తెప్పించుకునేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియా ఎరువుల విషయమై రైతులు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఇప్పటికే సరిపడా స్టాక్ ఉందని, ఇంకనూ యూరియా నిల్వలు ముందస్తుగానే తెప్పిస్తున్నామని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.