calender_icon.png 18 August, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితకు మళ్లీ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

12-08-2024 01:39:51 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల స్పందన కోరింది. సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్లపై స్పందిస్తూ ఇచ్చిన తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువస్తూ ఐదు నెలలుగా జైల్లో ఉన్నందున ఆమెకు బెయిల్‌కు అర్హత ఉందని కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. మొత్తం 493 మంది సాక్షుల విచారణ జరిగిందని కవిత న్యాయవాది వెల్లడించారు. మహిళగా సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలని న్యాయవాది పేర్కొన్నారు. కేజ్రీవాల్, సిసోడియా పిటిషన్లపై తీర్పు ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలని చెప్పారు. కేజ్రీవాల్, సిసోడియా కు బెయిల్ ఇస్తూ ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చిందని న్యాయవాది తెలిపారు.

మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తదుపరి విచారణనుఆగస్టు 20కి వాయిదా వేసింది. 2024 మార్చి 15న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అప్పటి నుండి ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును మొదటగా నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేపట్టింది. తరువాత సిబిఐ జారీ చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఇడి వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది.