28-07-2025 10:32:46 PM
మళ్ళీ అధికారం బిఆర్ఎస్ దే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
చిన్నంబావి: రాష్ట్రంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి(Former MLA Beeram Harshavardhan Reddy) పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. మండలంలో సంచలనం సృష్టించిన బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య కేసును చేదించడంలో పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి శ్రీధర్ రెడ్డి హత్య కేసును చేదించని యెడల నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రస్తుతం మంత్రి ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. 98 జీవో పై ముసలి కన్నీరు కారుస్తున్న మంత్రి గత 20 ఏళ్లుగా శ్రీశైలం నిర్వాసితులకు చేసింది ఏమని ప్రశ్నించారు. మా హాయంలో 78 మంది నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో చేయడంలో పూర్తిగా విఫలమైనదని ఈ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజాప్రతినిధులు సోమేశ్వరమ్మ,కేసి.రెడ్డి. వెంకట్రావమ్మ, శ్రీధర్ రెడ్డి, ఇదన్న యాదవ్, చిన్నారెడ్డి ,మధు, తిరుపాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.