07-08-2025 01:45:41 AM
కేసీఆర్ పథకాలను ప్రస్తావించిన జగదీశ్‌రెడ్డి
అభివృద్ధి జరగలేదంటూ అడ్డుకున్న వేణారెడి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం
సూర్యాపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్‌లో బుధవారం లబ్ధిదారులకు నిర్వహించిన రేషన్‌కార్డులు, ఇందిర మ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమం రసాభసాగా మారింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగదీశ్ రెడ్డి మాట్లాడే క్రమంలో జై జగదీశ్‌రెడ్డి అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు జై దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగదేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన అభి వృద్ధిని వివరించారు. అదే సమయంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కలగజేసుకొని బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో ఆత్మకూర్ (ఎస్) మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్త కూలేశ్వరం అయిందంటూ అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోసారి ఇరు పార్టీల నాయకులు మాట్లాడే ప్రయత్నం చేయగా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అని అధికారులు మైకులు కట్ చేశారు.