07-08-2025 01:47:04 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ‘బీసీ రిజర్వేషన్ల బిల్ ఆమోదం కోసం చేస్తున్న పోరాటం కేవలం ఒక్క తెలంగాణదే కాదని.. యావత్ భారతీయులు అందరిది’ అని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్‌లో చట్టబద్దత చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని కారణాల వల్ల ఈ నిరసన కార్యక్రమానికి రాహు ల్ హాజరు కాలేదు. దీంతో బుధవారం ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం కేవలం తెలంగాణది మాత్రమే కాదు.. యావత్ భారతీయులదని పేర్కొన్నారు. అణగారిన వర్గాల్లోని ప్రతి భారతీయుడికి అధికార భాగస్వామ్యంలో పురోగతి కోసం జరుగుతున్న యుద్ధమని తెలిపారు.
రాష్ట్రపతి బీసీ రిజర్వేషన్ బిల్లును పరిశీలించి ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ ఆకాంక్షించారు. బీసీ రిజర్వేషన్ల చట్టం సామాజిక న్యాయానికి నాంది పలుకుతుందని, దానిని సాధించుకోవడం కోస మే కాంగ్రెస్ పార్టీ ఈ భారీ నిరసన చేపట్టిందని తెలిపారు.
శిబుసోరెన్ అంత్యక్రియలకు వెళ్లడంతోనే..
ఇదిలా ఉండగా, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా హాజరుకావాల్సి ఉండేది. ఝార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి శిబుసోరేన్ మృతితో.. ఆయన అంత్యక్రియలకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. అందుకేబీసీ రిజర్వేషన్ల ధర్నాకు రాహుల్‌గాంధీ హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.