12-10-2025 02:00:39 AM
ప్రారంభించిన ‘స్పర్శ్ హాస్పిస్’
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వరల్డ్ హాస్పిస్ అండ్ ప్యాలియేటివ్ కేర్ డే సందర్భంగా హైదరాబాద్‌లో స్పర్శ్ హాస్పిస్ తమ విప్లవాత్మకమైన లివింగ్ విల్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో మొదటి అడ్వాన్స్‌డ్ కేర్ ప్లానింగ్‌కు అంకితమైన కేంద్రం కావడం విశేషం. ఈ క్లినిక్ ఉద్దేశం జీవితాంతం వైద్యం ఎలా కొనసాగాలన్న అంశంపై రోగులు తమ అభిప్రాయాలను చట్టపరంగా నమో దు చేసుకునే అవకాశం కల్పించడం.
ఇది ఈ ఏడాది హాస్పిస్ డే థీమ్ అయిన ప్రతి ఒక్కరికీ చివరి దశలో కూడా సానుభూతి, సౌకర్యం, గౌరవం కలిగిన వైద్య సేవలు అందాలన్న హామీని నిజం చేయడంకి అనుగుణంగా ఉంది. స్పర్శ్ హాస్పిస్ లివింగ్ విల్ క్లినిక్‌లో రోగులకు కన్సల్టేషన్లు, చట్టపరమైన మార్గదర్శకాలు, కౌన్సెలింగ్ సేవలు అందించబడతాయి. ప్యాలియేటివ్ కేర్ వైద్యులు, సైకాలజిస్టులు, అడ్వాన్స్ కేర్ ప్లానింగ్లో శిక్షణ పొందిన నిపుణులు ఈ సేవలను అందిస్తారు.
రోగుల అభిప్రాయాలు సరైన పద్ధతిలో లిఖితపూర్వకంగా నమోదు అవ్వడానికి, సాక్ష్యాలతో పాటు వైద్య బృందాలకు అందుబాటులో ఉండేలా చూడడం ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యం. “ప్రతి మనిషికి తన వైద్యం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఆ హక్కును గౌరవించే దిశలో లివింగ్ విల్ క్లినిక్ ఒక ముందడుగు” అని స్పర్శ్ హాస్పిస్ ఫౌండర్ ట్రస్టీ డా. ఎం. సుబ్రహ్మణ్యం తెలిపారు.
వరల్డ్ హాస్పిస్ అండ్ ప్యాలియేటివ్ కేర్ డే సందర్భంగా, గత 14 ఏళ్లలో 14,000 మందికి గౌరవప్రదమైన చివరి దశ సేవలు అందించిన స్పర్‌శ ప్రయాణాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ క్లినిక్ మా మిషన్లో మరో ముఖ్యమైన మైలురాయి, అని స్పర్శ్ హాస్పిస్ ఫౌండర్ ట్రస్టీ జగదీష్ రామడుగు అన్నారు.