08-03-2025 07:34:26 PM
మరో ఇద్దరికీ స్వల్ప గాయాలు
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసూల్రాబాద్ మండలం బొప్పన్ పల్లి విలేజ్ కు చెందిన కేతావత్ శంకర్ నాయక్, పార్వతిల చిన్న కుమారుడు కేతావత్ నాను(21) హైదరాబాద్ ప్రగతి నగర్ లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతూ వీఎన్ఆర్ కళాశాల హాస్టల్ లో ఉంటున్నాడు.
తన స్నేహితులు కార్తీక్, విశ్వంత్ లతో కలిసి శనివారం ఉదయం స్కూటీపై బయటికి వెళ్ళాడు. విశ్వంత్ స్కూటి నడుపుతుండగా కార్తీక్ వెనక కేతావత్ నాను కూర్చున్నాడు. హాస్టల్ గేట్ దాటి కొద్ది దూరం రాగానే బాచుపల్లి రహదారిపై వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న కేతావత్ నానుపై నుండి వాహనం వెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించగా, మిగతా ఇద్దరు స్నేహితులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కేతావత్ నాను మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి, గాయపడ్డ మరో ఇద్దరు ఎస్ఎల్జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.