calender_icon.png 19 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లులో బీసీ జేఏసీ బంద్ విజయవంతం

18-10-2025 09:14:01 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శనివారం ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లు జిల్లాలో బంద్ విజయవంతమైంది. సకలజనుల సమ్మె తరహాలో బీసీ సమాజమంతా రోడ్లపైకి వచ్చి బంద్ సక్సెస్ అయ్యేవిధంగా కృషి చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు,  యువకులు, మేధావులు, కార్మిక, కర్షక వర్గాలకు చెందిన వారు ఉద్యోగస్తులు, లాయర్లు బీసీ జేఏసీ బంద్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిలు బీసీ జేఏసీ బంద్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేని కారణంగా బీసీలు అన్ని రంగాల్లో అణిచివేతకు గురి చేయబడుతున్నారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను నేటి వరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బీసీలు వెనకబాటుకు గురవుతున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారని, బీసీ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సమాజమంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకొని అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ముఖ్యమంత్రిని చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డిల ప్రాధాన్యత పెరిగి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించడం పంపించిన ఆ బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగానే అసెంబ్లీలో ఆర్డినెన్స్ ని గవర్నర్ కు పంపించడం ఆ ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే జీవో 9ని అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడంతో రెడ్డి జాగృతికి చెందిన అగ్ర కులస్తులు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పిదమన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి రాష్ట్ర నాయకత్వమంతా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సైతం బీసీ రిజర్వేషన్ల పట్ల ఆ పార్టీ వైఖరి ఏమిటో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, లేదా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో ప్రకటింప చేయాలన్నారు.

మరో స్వాతంత్ర పోరాటం తరహాలో బీసీ ఉద్యమం బీసీ జేఏసీ బంద్ పిలుపుతో ఉవ్వెత్తున ఎగిసి పడిందని, ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని ముగింపు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా మేమెంతో మాకంతా వాటా అని నిలదీసి కొట్లాడుతామని హెచ్చరించారు.బంద్ లో పాల్గొన్న సబ్బండ వర్గాల ప్రజలకు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. బంద్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ యూనివర్సిటీ వద్దగల మహాత్మా జ్యోతిబాపూలే దంపతులకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి..యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి ములుగు రోడ్డు వద్ద గల పూలే విగ్రహం వరకు ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి విశేష కృషిచేసిన బీసీ సమాజానికి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను సాధించేంతవరకు విశ్రమించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన బీసీ జేఏసీ బంద్ కు ఆయన సంఘీభావం తెలిపారు. అదేవిధంగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి లు బీసీ జేఏసీ బంద్ లో పాల్గొని మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య దేశం, పాలకవర్గాలు హామీ ఇవ్వడం ఓట్లు వేయించుకోవడం, హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదే, కానీ ఇచ్చిన హామీల నెరవేర్చకుండా మమ్మల్ని రోడ్డుమీద కూర్చోబెట్టే పరిస్థితి కనిపిస్తోంది, ప్రజలను రోడ్లు ఎక్కించే పరిస్థితి పాలకవర్గాలే కల్పిస్తే, ఇది ప్రమాదానికి సంకేతం.

ఏ ప్రజలైతే నమ్మి మీకు అధికారం ఇచ్చారో ఆ ప్రజల్ని రోడ్డు ఎక్కే పరిస్థితికి రావడం అంటే రగులుతున్న ఆవేదన, అగ్రహానికి, అణిచివేతకు నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బిజెపి పార్టీలు కలిసి రిజర్వేషన్ అంశాన్ని చట్టబద్ధత తేవాలని, కాంగ్రెస్ పార్టీ తెలిసి కావాలనే ఈ ద్రోహం చేసిందని, ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. చట్టం ఎలా చేయాలో తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్న అన్నారు. బీసీ జేఏసీ బంద్ పిలుపులో భాగంగా బీసీ జేఏసీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ మహిళా నాయకులు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు, బీసీ యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నేతలు ఉదయం 4 గంటలకే రోడ్లపైకి వచ్చి బస్ డిపోల వద్ద ధర్నా చేసి బస్సులను అడ్డగించి హన్మకొండ, వరంగల్ నగరంలోని విద్యా సంస్థలను, వాణిజ్య, వ్యాపార సంస్థలను, సినిమా థియేటర్లను, పెట్రోల్ బంక్ లను స్వచ్ఛందంగా బంద్ చేయించారు.