13-08-2025 12:48:26 AM
గజ్వేల్ ఆగస్టు 12: గజ్వేల్ పట్టణంలో గర్భిణీలు, బాలింతలు, పుట్టిన పిల్లలకు, చిన్నారులకు నిలోఫర్ తరహాలో వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో దాదాపు రూ. 27 కోట్ల వ్యయంతో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించారు. వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వారి నివాసం కోసం రూ. 8 కోట్ల రూపాయలతో 16 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జి ప్లస్ వన్ పద్ధతిలో నిర్మించారు.
అయితే ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడంతో వైద్యుల సిబ్బంది తమ ఇంటి వద్ద నుండే వచ్చి విధులకు హాజరవుతున్నారు. వైద్యులు, సిబ్బంది వారి కేటాయించిన నివాస భవన సముదాయాలను వినియోగిస్తే నెల జీతం లో వచ్చే ఇంటి అలవెన్సులు ప్రభుత్వం చెల్లించదు. స్థానికంగా ఉండే ఇంటి అద్దె కన్నా ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు ఎక్కువ స్థాయిలో ఉండడంతో వాటిని కోల్పోవడానికి వైద్యులు గాని సిబ్బంది గాని ఇష్టపడడం లేదు.
దీంతో హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇంటి వద్ద నుంచి వస్తు విధులకు హాజరవుతున్నారు. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు వృధాగానే ఉండిపోయాయి. ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలో అర్థం కాక అధికారులు వాటిని వృధాగా విడిచిపెట్టారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో దృష్టి సారించి ప్రజాధనంతో నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.