calender_icon.png 13 August, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌస్ ఆలం

13-08-2025 06:03:52 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు భరోసా కేంద్రంలో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల వివరాలను పరిశీలించిన ఆయన, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకు లోనైన పిల్లలకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించేందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్, జిల్లాల్లో ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బాధితులకు సేవలందించడంలో భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి సత్ఫలితాలనిస్తోందని, లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షల శాతం పెరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీలత, భరోసా కేంద్రం సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.