calender_icon.png 20 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడి బ్యాగులో తూటా

20-10-2025 12:28:53 AM

  1. మూసాపేట మెట్రో స్టేషన్‌లో కలకలం 
  2. తనిఖీల్లో గుర్తించిన భద్రతా సిబ్బంది  
  3. బీహార్‌కు చెందిన ఒకరిని అదుపులో తీసుకున్న పోలీసులు
  4. కేసు నమోదు చేసి విచారణ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ బ్రాలుడి వద్ద తూటా లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఎండీ ఆలం(28) తన సవతి కుమారుడితో కలిసి మూసాపేట ప్రగతి నగర్‌లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్ పనులు చేసు కుంటున్నాడు.

శనివారం రాత్రి బాలుడు మెట్రో రైలులో ప్రయాణించేందుకు మూసాపేట స్టేషన్‌కు వచ్చాడు. ప్రవేశ ద్వారం వద్ద లగేజీ స్కానింగ్ కోసం తన బ్యాగును యంత్రంలో పెట్టగా, అందులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బ్యాగును తనిఖీ చేయగా, అందులో 9 ఎంఎం తూటా ఒకటి బయటపడింది. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, దాన్ని తన సవతి తండ్రి బీహార్ నుంచి తెచ్చినట్లు చెప్పడంతో కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కూకట్‌పల్లి సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసే క్రమంలో, స్కానర్‌లో బాలుడి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. బ్యాగును తెరిచి చూడగా, అందులో 9 ఎంఎం తూటా లభ్యం కావడంతో వారు వెంటనే ఉన్నతాధికారులకు, కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు బాలుడిని విచారించగా, ఆ తూటా తనది కాదని, తన సవతి తండ్రి ఆలం తన సొంత ఊరి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడని తెలిపాడు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆలంను అదుపులోకి తీసుకుని, తూటాను ఎందుకు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే కోణంలో విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.