24-08-2025 01:02:49 AM
-బెట్టింగ్ యాప్స్, క్యాసినోలు నిర్వహిస్తున్న చిత్రదుర్గ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీ
-12 కోట్ల మేర నగదు, కోటి మేర విదేశీ కరెన్సీ స్వాధీనం
-6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం
గ్యాంగ్‌టక్, ఆగస్టు 23: ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ బెట్టింగ్ నిర్వహిస్తున్న కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర (పప్పీ)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం గ్యాంగ్‌టక్‌లో అరెస్ట్ చేశారు. సదరు ఎమ్మెల్యేకు చెందిన అనేక ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం సోదాలు చేసిన ఈడీ అధికారులు చివరికి శనివారం అతడిని అరెస్ట్ చేశారు.
అనంతరం స్థానిక కోర్టు ఎదుట అతడిని హాజరు పరిచి ట్రాన్సిట్ రిమాండ్‌పై బెంగళూరుకు తరలిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహించడంతో పాటు, గోవా క్యాసినో గోల్డ్, ఓసియన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓసియన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో పేర పలు క్యాసినోలను పప్పీ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్యాసినోల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు.
ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటి నుంచి దాదాపు రూ. 12 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తంలో కోటి మేర విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు గుర్తించారు. రూ. 6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే వీరేంద్ర సోద రుడు కేసీ. నాగరాజ్, అతడి కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్ నివాసాల్లో నాలుగు లగ్జరీ కార్లు, 17 బ్యాంక్ ఖాతాలు, రెండు బ్యాంక్ లాకర్లు, ఆస్తికి సంబంధించిన అనేక పత్రాలు లభించాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 ప్రకారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో లభించిన విదేశీ కరెన్సీలో డాలర్లు, పౌండ్స్, దిర్హామ్స్, యూరో కరెన్సీ ఉన్నాయి. భారత పార్లమెంట్ ఆన్‌లైన్ గేమ్స్‌ని నిషేధిస్తూ చట్టం చేసిన రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే అరెస్ట్ అవడం గమనార్హం. శుక్రవారమే ఈడీ అధికారులు వీరేంద్రకు సంబంధించిన 31 ప్రాంతాల్లో సోదా లు నిర్వహించారు.