24-08-2025 12:32:52 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 23 (విజయక్రాంతి): బల్దియాలో దోమల దందా అధికారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. మహానగరాన్ని దోమలు పట్టిపీడిస్తుంటే, వాటి నివారణకు కేటాయించిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్‌ఎంసీ ఎంటమా లజీ విభాగంలోని కొందరు అవినీతి అధికారులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు.
క్షేత్ర స్థాయిలో ఫాగింగ్ చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టిస్తూ, డీజిల్, పెట్రోల్, మరమ్మతుల పేరుతో భారీగా బిల్లులు స్వాహా చేస్తున్నారు. ఈ అవినీతి బాగోతంపై ఏకంగా ఎంటమాలజీ సిబ్బందే ప్రజావాణిలో ఫిర్యా దు చేయడంతో, బల్దియా విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.
ప్రజావాణిలో ఫిర్యాదు
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పక్కాగా ఫాగింగ్ చేయాలన్న కమిషనర్ ఆదేశాలు గాలికొదిలేశారు. దీనిపై మల్కాజ్‌గిరి సర్కిల్‌కు చెందిన ఎంటమాల జీ వర్కర్లు ఈ నెల 1న ప్రజావాణిలో లెక్కలతో సహా ఫిర్యాదు చేశారు. తమ సర్కిల్‌లో రోజూ ఫాగింగ్ పేరుతో 120 లీటర్ల డీజిల్, 8 లీటర్ల పెట్రోల్‌ను అధికారులు కాజేస్తున్నారని, దీని ద్వారా ప్రతిరోజూ సుమారు రూ. 13,000 పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి, లోతుగా ఆరా తీస్తు న్నారు. విచారణలో భాగంగా, బక్రీద్ సెలవు దినమైన జులై 7న కూడా సిబ్బంది హాజరైనట్లు అటెండెన్స్ వేసి, ఆ రోజుకు సంబం ధించిన డీజిల్, పెట్రోల్‌ను కూడా డ్రా చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.
బోగస్ బిల్లులు సృష్టించి
గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు గాను ఉన్న 300 చిన్న, 63 పెద్ద ఫాగింగ్ యంత్రాలలో, దాదాపు 50 యంత్రాలు ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. అయితే అధి కారులు ఈ పాడైన యంత్రాల పేరుతో కూడా ఇంధనాన్ని డ్రా చేయడమే కాకుండా, వాటికి మర మ్మతులు చేయకుండానే చేసినట్లు బోగస్ బిల్లు లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నిధులను ఎంట మాలజీ ఎస్‌ఈలు, సూపర్‌వైజర్లు కుమ్మక్కు పంచుకుంటున్నారని, డీజిల్‌ను బయట అమ్ముకుంటున్నారని సొంత సిబ్బందే ఆరోపిస్తున్నారు.
ఇంధనానికి బదులుగా నగదు
డీజిల్ దందాకు చెక్ పెట్టేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూపన్లకు బదులుగా ఏటీ ఎం తరహా కార్డు విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్ జోన్‌లో అమలులోకి తెచ్చారు. అయితే, అవినీతి అధికారులు ఇక్క డా తమ జిమిక్కు చూపిస్తున్నారు. పెట్రోల్ బంకులతో కుమ్మక్కు, ఇంధనానికి బదులుగా నగదు తీసుకుంటూ బిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దోమల నివారణకు 30 కోట్ల ఖర్చు
జీహెచ్‌ఎంసీ ఏటా దోమల నివారణకు రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా, ఆ నిధులు క్షేత్రస్థాయికి చేరకుండా పక్కదారి పడుతున్నాయి. దీంతో నగరవాసులు డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం, “ప్రజల్లో మార్పు వస్తేనే దోమలు పోతాయి” అని ఉచిత సలహాలు ఇస్తుండటం గమనారం. ఇప్పటికైనా ఉన్నతస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ఈ “దోమల దందా”కు పాల్పడుతున్న అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
అక్రమాలకు కేంద్ర బిందువులుగా..
ఈ దందా కేవలం ఒక్క సర్కిల్‌కే పరిమితం కాలేదు. గ్రేటర్‌లోని చాలా ప్రాం తాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ ఈ అక్రమాలకు కేంద్ర బిందువులుగా మారారు. మల్కాజ్‌గిరి సర్కిల్ ఫిర్యాదుపై సికింద్రాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గాప్రసాద్‌ను వివర ణ కోరగా, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తనకు తెలియదని చేతులెత్తేయ డం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు కీలకమైన శేరిలింగంపల్లి జోన్‌లో సీనియర్ ఎంటమాలజిస్ట్ లేకపోవడంతో, వర్కర్లు ఫీల్డ్‌కు రాగానే అటెండెన్స్ వేసి ఇళ్లకు పంపించేస్తున్నారని, దీంతో ఫాగింగ్ పూర్తిగా అటకెక్కిం దని తెలుస్తోంది.