calender_icon.png 24 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ జల సవ్వడి

24-08-2025 12:46:50 AM

26 గేట్ల ద్వారా నీటి విడుదల

దిగువకు కృష్ణమ్మ పరుగులు

నాగార్జునసాగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జునసా గర్ జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. సాగర్ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నా రు. ఎగువ శ్రీశైలం నుంచి భారీగా వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ డ్యాం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు మొత్తం 26 డ్యామ్ గేట్లను ఎత్తారు.

ఇన్ ఫ్లో 4,49,990 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 4,09,921 క్యూసెక్కులుగా కొనసాగుతున్న ది. పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 583.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 295.9925 టీఎంసీలు ఉన్నది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 30,125 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 2400 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. 

నిండుకుండలా ఎస్సారెస్పీ 

ఆర్మూర్(విజయక్రాంతి): ఉత్తర తెలంగా ణ వరప్రదాయని అయిన శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నిండికుండలా మారింది. ఎగువ ప్రాంతమైన  మహారాష్ర్టలో, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కు ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకుగాను 80 టీఎంసీల సామర్థ్యము కలదు. శనివారం నాటికి పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండు కుండలా మారింది.

ఈ వానకాల సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు  ప్రాజెక్టులోకి 130 టీఎంసీల వరద నీరు వచ్చింది. వరద గేట్ల ద్వారా సుమారు 47 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. వరద కాలువ ద్వారా నీటిని వదులుతూ కరీంనగర్ జిల్లాలోని మద్య మానేరు డ్యామ్ నింపుతున్నారు. 16 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.