calender_icon.png 24 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంటాడుతున్న యూరియా కొరత

24-08-2025 12:29:48 AM

  1. ఉదయం 4 గంటల నుంచే క్యూ 
  2. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ
  3. పలు చోట్ల రైతుల ధర్నా
  4. సిద్దిపేట జిల్లా అల్వాలలో పాస్ బుక్కులపై మద్యం సీసాలతో నిరసన 
  5. రైతు వేదికలో అధికారులను నిర్బంధించిన రైతులు 

సిద్దిపేట, ఆగస్టు 23 (విజయక్రాంతి)/దౌల్తాబాద్: రాష్ర్టంలో యూరియా కొరత రైతులను వెంటాడుతున్నది. మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస  యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలవడంతో శనివారం ఉదయం నాలుగు గంటల నుంచే రైతులు పాసుబుక్కులు లైన్‌లో పెట్టి క్యూ కట్టారు.

కొంత మంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్‌బుక్‌లపై పెట్టి నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని, రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదని మండిపడ్డారు. అయితే యూరియా దొరకని రైతు లు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు. ఎంపీ రఘునందన్‌రావు యూరియా కొరత లేదని చెప్పి, రైతులను మోసం చేయడం సరైనది కాదని అన్నదాతలు విమర్శించారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాం డ్ చేశారు. కాగా ఎస్సై సమత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎరువుల కొరతతో రైతు లు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యవసాయ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ స్థాయి వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు.

ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, తక్షణమే అవసరమైన యూరియాను సరఫరా చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఫర్టిలైజర్ షాప్ లోకి 570 బస్తాల యూరియా రావడంతో శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి చెప్పుల తో రైతులు క్యూ కట్టారు. పోలీసుల బందోబస్తు నడుమ రైతులకు టోకెన్లు అందజేశారు. 

రోడ్డుపై బైఠాయించి నిరసన 

హన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని ఆయా గ్రా మాల రైతులు శనివారం మండల కేంద్రంలోని ఎన్‌హె 167పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాలకు అవసరమైనప్పుడు యూరియా లేకుంటే అనవసరం ఉన్నప్పుడు ఎంత ఇస్తే ఏమి ఉపయోగమని అసహనం వ్యక్తం చేశారు. నిత్యం టీవీలలో పేపర్లలో యూరియా అందుబాటులో ఉం ది అని చెబుతున్న ప్రభుత్వం ఎక్కడ ఉందో కూడా చెప్పాలన్నారు.

రాష్ర్టంపై కేంద్రం,  కేంద్రం రాష్ర్టంపై యూరియా అందించడం లేదని ఆరోపణలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులు పెడితే ఏమి లభిస్తుందని ప్రశ్నించారు. కాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనుకేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఎదుట శనివారం మధ్యా హ్నం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. 

నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. కేవలం 440 బస్తాల యూరియా మాత్రమే రావడంతో ఒక్కసారిగా రైతులు పోటీపడ్డారు.  ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండ డంతో తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు 

నాగర్‌కర్నూల్, ఆగస్టు 23 (విజయక్రాంతి): విజయక్రాంతి పత్రికలో శనివా రం ప్రచురితమైన కథనానికి నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్‌రావు స్పందించారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని అరుణో దయ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి అందులోని రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో నమోదు చేయకుండానే అత్యధిక ధరకు యూరియాను నడిరోడ్డుపై లారీల్లో పంపిణీ చేయడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.

15 రోజులపాటు ఎలాంటి లావాదేవీలు జరపొద్దని సీజ్ చేశారు. పట్టణంలోని నాగార్జున ఫర్టిలైజర్స్ దుకాణగారు అధిక ధరకు విక్ర యించడంతోపాటు ఓల్డ్ స్టాక్ పురుగుల మందులు బలవంతంగా రైతులకు అం టగడుతుండడంతో విజయక్రాంతి వెలుగులోకి తెచ్చిన కథనానికి ఆయన స్పం దించారు. షోకాజ్ నోటీసులను జారీ చేస్తూ వివరణ ఇవ్వాలన్నారు.