25-12-2025 02:33:14 AM
హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో అరుదైన గౌరవం
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): హైబిజ్ టీవీ నిర్వహించిన 3వ ఎడిషన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో ఘనంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ లీడర్స్, ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ఈ వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు. వివిధ రంగాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన 50కిపైగా సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.
ఎన్‌ఎండీసీ, ఎన్‌టీపీసీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్, హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కమిషనర్, స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సత్కారం అందుకున్నాయి. వియెట్జెట్ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రతీకగా గుర్తింపుపొందింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. కె. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. బిజినెస్ ఎక్సలెన్స్ అనేది లాభాలకే పరిమితం కాదు.
సమాజానికి విలువ సృష్టించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ధికి తోడ్పడటం నిజమైన ఉన్నతత అని అన్నారు. ఏవీపీఎస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇటువంటి అవార్డులు పారిశ్రామికవేత్తలకు ప్రేరణనిస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. డా.నరేంద్ర రామ్ నాంబులా (చైర్మన్ అండ్ ఎండీ లైఫ్స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), ఎం రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్, భారతీ సిమెంట్), గుమ్మి రామ్‌రెడ్డి (ప్రెసిడెంట్ ఎలెక్ట్ క్రెడై నేషనల్), ఎం రాజ్ గోపాల్ (ఎండీ హైబిజ్ టీవీ), డాక్టర్ జె సంధ్యారాణి (హైబిజ్ వన్ ఫౌండర్ అండ్ ఎండీ)మిస్ యూనివర్స్ తెలంగాణ కాష్వి పాల్గొన్నారు.