25-12-2025 02:32:10 AM
వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్
ఎంసీహెచ్, జీజీహెచ్‌ల తనిఖీ
మంచిర్యాల, డిసెంబర్ 24 (విజయక్రాం తి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘సీ’ సెక్షన్ లను తగ్గించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జీజీహెచ్ లను బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిజేరియన్ లు తగ్గించడం ద్వారా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని, మాతా శిశు సంరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర అని అన్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని, కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. ప్రతి ఆశ, ఆరోగ్య కార్యకర్త, వైద్యులు గర్భిణీలకు, మహిళలకు, తల్లులకు, ఇంటి వారికి సాధారణ ప్రసవాలపై అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో వంద శాతం గర్భవతుల నమోదు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే వారికి అన్ని రకాలైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు గర్భవతులకు అన్ని రకాల పరీక్షలు చేయించాలని, అందుబాటులో ఉండాలన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెల్ప్ డెస్క్ నుంచి ఫోన్ చేసి గర్భిణీ వివరములను తెలుసుకొని ఏ ఆసుపత్రిలో ప్రసవం కోసం వస్తారో వారి వివరాలను ముందుగా వైద్యులకు తెలియజేయాలని, సరైన సౌకర్యాలు కల్పించాలని, సాధారణ ప్రసవాలపైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎంసీహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
ఎంసీహెచ్ లోని క్యాన్సర్ వార్డును సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం నడుస్తున్నందున ఆరోగ్య కార్యకర్తలు వారి ప్రాంతాలలో గ్రామాలలో సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి తగు చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత, జీజీహెచ్ సూపరింటెండ్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్‌ఎంఓ డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ ప్రసాద్, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యం అందిస్తున్న ప్రసూతి వైద్యులు, డిపిఓ ప్రశాంతి, పద్మ సిహెచ్ ఓలు వెంకటేశ్వర్లు, సత్తయ్య, నాందేవ్, డెమో బుక్క వెంకటేశ్వర్, విశ్వేశ్వర రెడ్డి, నర్సింగ్ అధికారులు, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.