31-08-2025 01:17:34 AM
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఘటన మరచిపోలేనిది. అలాంటి ఘటనే
నాటి నిజాం రాజ్యంలోని హైదరాబాద్ స్టేట్‌లో జరిగింది. ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో జరిగిన మారణహోమం తెలంగాణ సాయుధ పోరాటాన్ని మలుపుతిప్పింది. ఈ మారణహోమంతోనే నిజాం రాజ్యంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ఏడో నిజాం రాజు పతనానికి దారితీసింది. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలు, రజాకార్లకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వీర బైరాన్‌పల్లిది ఒక ప్రత్యేక స్థానం. ఈ గ్రామం భారత సైన్యం ’ఆపరేషన్ పోలో’కు దారితీసిన ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.
భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని పొందినప్పటికీ, నాటి హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే కొనసాగింది. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి నిజాం తన ప్రైవేట్ సైన్యమైన రజాకార్లను రంగంలోకి దించాడు. రజాకార్లు తెలంగాణ అంతటా గ్రామాలపై దాడులు చేస్తూ దోపిడీలు, లైంగికదాడులకు పాల్పడ్డారు.
అయితే వీర బైరాన్‌పల్లి గ్రామస్తులు రజాకార్లకు ఎదురొడ్డి నిలిచారు. దీంతో రజాకార్లు గ్రామంపై అక్కసు పెంచుకొని పలుసార్లు దాడి చేశారు. గ్రామీణుల ప్రతిఘటనకు పునాదిగా, గ్రామంలో ఉన్న పురాతన రాతి మట్టి కోట (బురుజు) వ్యూహాత్మక స్థానాన్ని ఇచ్చింది. ఈ బురుజుపై నుంచి గ్రామ రక్షణ దళాలు రజాకార్లను ఎదుర్కొనేవి. 1948 జూన్ నెల నుంచి రజాకార్లు మూడుసార్లు బైరాన్‌పల్లిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ప్రతిసారీ గ్రామస్తులు వడిసెలలు, సంప్రదాయ ఆయుధాలతో వారిని తిప్పికొట్టారు. దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్ రావు వంటి స్థానిక నాయకులు రక్షణ దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను ఎదుర్కొని గ్రామ సమీపంలో వారు దోచుకున్న సంపదను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది రజాకార్లలో ఆగ్రహాన్ని పెంచింది.
1948 ఆగస్టు 27 బ్లాక్ డే
బైరాన్‌పల్లి గ్రామం నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో రజాకార్లు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. 1948 ఆగస్టులో లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలపై దాడి చేసి తగులబెట్టిన తర్వాత వారి దృష్టి బైరాన్‌పల్లిపై పడింది. 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున, అప్పటి డిప్యూటీ కలెక్టర్ హాషిం నాయకత్వంలో దాదాపు 500 మంది సైనికులతో కూడిన భారీ సైన్యం గ్రామంపై ఆకస్మిక దాడికి దిగింది. గతంలో మూడుసార్లు విఫలమైన రజాకార్లు, ఈసారి నిజాం సైన్యం సాయంతో వచ్చారు. బురుజుపై ఉన్న సైనిక ఫిరంగిని కాల్చివేయడంతో, రజాకార్లు సులభంగా గ్రామంలోకి ప్రవేశించారు. వెంటనే గ్రామంలో ఊచకోతకు పాల్పడ్డారు.
కొన్ని నివేదికల ప్రకారం 96 మంది గ్రామస్తులు, మరికొన్నింటి ప్రకారం 118 మందిని దారుణంగా కాల్చి చంపారు. రజాకార్లు బుల్లెట్లను ఆదా చేయడానికి ప్రజలను రెండు, మూడు వరుసలుగా నిలబెట్టి ఒకే బుల్లెట్‌తో కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దారుణమైన మారణహోమంలో ఒకే రోజున 70 మందికి పైగా మరణించారు. ఆడవారిపై లైంగికదాడులు చేసి వారిని దోచుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆడవారిని నగ్నంగా మార్చి, శవాల ముందు బతుకమ్మ ఆడించారు. ఈ దారుణం చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా నిలిచిపోయింది.
కలలో కూడా దారుణాలు
ఆ రోజు జరిగిన దారుణాలను కండ్లారా చూసి, గాయాలతో బయటపడిన ఏకైక ప్రామాణిక ప్రత్యక్ష సాక్షి మల్లయ్య. రజాకార్లు ప్రజలను వరుసలో నిలబెట్టి కాల్చి చంపినప్పుడు, ఒక బుల్లెట్ మల్లయ్య ఎడమ చేతిని చీల్చుకుంటూ వెళ్లిపోయింది. తాను చనిపోయాడని భావించి శవాల కుప్పలో పడేశారు. ఈ సంఘటనతో ఆయన ఎడమ చేయి పనికిరాకుండా పోయింది. అది 360 డిగ్రీలు తిరుగుతుండేది. ఆయన కొద్దిరోజుల క్రితమే చనిపోయాడు. మల్లయ్యతో పాటు చల్లా చంద్రారెడ్డి కూడా రజాకార్ల దారుణాలకు సాక్షిగా ఉన్నాడు. చంద్రారెడ్డి ఆ రాత్రి గస్తీ తరువాత ఇంటికి వెళ్లిపోయి, ప్రాణాలతో బయటపడ్డానని చెప్పడం ఆనాటి భయంకర పరిస్థితులకు నిదర్శనం. బైరాన్‌పల్లి మారణహోమాన్ని అర్థం చేసుకోవడానికి, రాతపూర్వక రికార్డుల కంటే ప్రాణాలతో మిగిలిన వారి జ్ఞాపకాలే అత్యంత విలువైనవిగా మిగిలాయి.
హైదరాబాద్‌పై ఆపరేషన్ పోలో
నిజాం సాయంతో రజాకార్లు సాగించిన ఆగడాలు, దౌర్జన్యాలు భారత ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన కలిగించాయి. నిజాం తన ప్రజలను రక్షించడంలో విఫలమయ్యాడని, శాంతిభద్రతలను కాపాడేందుకు భారత సైన్యం జోక్యం చేసుకుని 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసింది. ఈ సైనిక చర్యకు ’ఆపరేషన్ పోలో’ అని పేరు పెట్టారు. మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి నేతృత్వంలోని భారత సైన్యం ఐదు దిశల నుంచి హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. భారత సైన్యం ముందు నిజాం సైన్యం, రజాకార్లు నిలబడలేకపోయారు. కేవలం ఐదు రోజుల్లోనే భారత సైన్యం.. నిజాం సైన్యాన్ని ఓడించి, హైదరాబాద్ నగరాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది.
సెప్టెంబర్ 17న విలీనం
1948 సెప్టెంబర్ 17న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించాడు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. దీంతో దాదాపు రెండున్నర శతాబ్దాల నిజాం పాలనకు తెరపడింది.
త్యాగాల జ్ఞాపకం బైరాన్‌పల్లి
బైరాన్‌పల్లి మారణహోమం నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 27న ఈ గ్రామం తమ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటుంది. గ్రామం వెలుపల అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించారు. దానిపై ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చుతామని హామీ ఇచ్చింది. తద్వారా యువత ఈ ప్రాంతాన్ని సందర్శించి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పొందవచ్చని పేర్కొంది.
చరిత్రలో బైరాన్‌పల్లి స్థానం
బైరాన్‌పల్లి మారణహోమం ఒక మారుమూల గ్రామంలో జరిగిన రక్తపాతం మాత్రమే కాదు.. ఇది నిజాం పాలన చివరి దశలో జరిగిన భయానక అరాచకాలకు, భారతదేశ సమైక్యతకు ప్రజలు చేసిన త్యాగాలకు ఒక తిరుగులేని సాక్ష్యం. నిజాం ప్రభుత్వం రజాకార్ల ద్వారా ప్రజా ప్రతిఘటనను అణచివేయడానికి ఎంత దూరం వెళ్లిందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది. అందుకే బైరాన్‌పల్లి వీరగాథ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక అసాధారణ అధ్యాయంగా నిలిచిపోయింది. రజాకార్ల దుర్మార్గాలకు గుర్తుగా నిలిచింది. ఈ విషాద గాథ భవిష్యత్తు తరాలకు స్వాతంత్య్రపు విలువను, త్యాగాలను తెలియజేస్తుంది.
మేకల ఎల్లయ్య, హుస్నాబాద్, విజయక్రాంతి