31-08-2025 01:16:04 AM
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత కాలంలో 38 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని తీసివేస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని స్థానంలో కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. అవే ఉత్తర్వులను ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రప్రభుత్వాలన్నీ అమలు చేస్తూ వస్తున్నాయి.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వమే పెన్షన్ చెల్లిస్తున్నది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలవుతున్నది. పాత విధానంలోనైతే ప్రభుత్వమే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో జమయ్యే జీతంలో నెలకు ప్రభుత్వం పదిశాతం కోత విధిస్తుంది. దానికి ప్రభుత్వం కూడా పదిశాతం కలుపుతుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు ఎస్బీఐ, యూటీఐ, ఎల్‌ఐసీలతో షేర్‌మార్కెట్లలో పెట్టిస్తాయి. అలా కొన్నేళ్ల పాటు సొమ్ము షేర్లలోనే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి సెటిల్‌మెంట్ జరుగుతుంది. ఒక్కసారి డబ్బు సెటిల్‌మెంట్ అయితే ఇక ఉద్యోగులకు పెన్షన్‌పై ఎలాంటి అధికారాలు, హక్కులు ఉండవు.
ఐక్య పోరాటాలకు పిలుపు..
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కలిసి టీఎస్‌సీపీఎస్‌ఈయూ అనే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, జిల్లా.. ఆఖరికి మండల స్థాయిలోనూ ఉద్యోగులు కమిటీలుగా ఏర్పడ్డారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగులు ‘అబీ నహీ తో కబీ నహీ’ (ఇప్పుడు కాకుంటే.. ఇంకెప్పుడూ కాదు) అనే నినాదంతో ఉద్యమించారు. ఢిల్లీస్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు పోరాటం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికలు ముగిసి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా, రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు.
దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలైన ఎన్జీవో, టీఎన్జీవో, టీఆర్టీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, టీఎస్టీయూ, బీటీయూ, టీపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం, సూటా, టీటీఎఫ్, టీటీఏ మొదలైన అన్ని సంఘాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ఒకే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేశాక, పదవి విరమణ అనంతరం పెన్షన్ ఉండదనే ఉద్దేశంతో ఎక్కువ మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు మళ్లుతారు. త్రివిధ దళాలు, పోలీస్‌శాఖల్లోనూ అందుకే ఉద్యోగాలు సాధిస్తారు. దేశంలో అత్యున్నత ప్రభుత్వ కొలువులైన ఐఏఎస్, ఐపీఎస్ కొలువులు సాధిస్తారు. వారు జీవితాంతం తమ శాఖల్లో పనిచేస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తారు. పబ్లిక్ సర్వెంట్లుగా చివరకు పదవి విరమణ చేస్తారు. చివరకు వారికి దొరికే ప్రతిఫలం సీపీఎస్ మాత్రమే. కానీ, ఒక శాసన సభ సభ్యుడు లేదా ఒక శాసనమండలి సభ్యుడు లేదా ఒక పార్లమెంట్ సభ్యుడు మాత్రం కేవలం ఐదేళ్లు పదవిలో కొనసాగితే, అతడికి/ఆమెకు జీవితకాలం పెన్షన్ వస్తుంది. కానీ, అదే నియమం ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు వర్తింపజేయడం లేదో అర్థం కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
బాగ్‌లింగంపల్లిలో సభ..
ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి నుంచి ఆఫీస్ సబ్ ఆర్డినేట్ (అటెండర్) వరకు అన్ని స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం తీసివేసి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. పెన్షన్ వృద్ధాప్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రక్షణ లాంటిది. వయస్సు మీద పడిన తర్వాత ఎవరి మీదా ఆధారపడకుండా, ఆ ఉద్యోగి స్వంతంత్రంగా బతకడానికి తోడ్పడే సాధనం. అలాంటి మౌలిక హక్కును హరించి వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీంను అమలు చేయడంపై ఉద్యోగులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రుల నుంచి రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రుల వరకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తూ వస్తున్నారు. అయినా ఫలితం లేదు. దీంతో ఉద్యోగులంతా ఒక్కటవుతున్నారు. ఐక్య ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. తెలంగాణలో కొద్దిరోజులుగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను కూడగట్ట గలిగారు. ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం తీసివేసి 21 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా.. ఈ సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినం నిర్వహించనున్నారు.
దీనిలో భాగంగానే హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు లలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్స్‌లో సభ ఏర్పాటు చేసి, నిరసన వ్యక్తం చేయాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి భావించాయి. ఈమేరకు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. కరపత్రాలు, వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. కానీ, ఆగస్టు 30 (శనివారం)నుంచి శాసనసభ సమావేశాలు ఉండటం, తెలుగు లలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్స్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్యమ నేతల బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపానికి వేదిక మార్చారు. సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
ఎన్నికల హామీలపై ఆశలు..
గత ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉన్నామని, కానీ.. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ కావడం వల్ల తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ప్రకటించారు. అంతకుమించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. అందుకు తగిన మూల్యం బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారనే నమ్మకంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు.
సీఎం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల మౌలిక హక్కైన పెన్షన్ విధానాన్ని తొలగించడం అవివేకమైన చర్య అంటూ పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ ఎస్.విజయభాస్కర్ 92908 26988