19-08-2025 06:34:44 PM
ఎరువుల గోదాం ఆకస్మిక తనిఖీ
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): అవసరమున్నచోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట ఎట్టి పరిస్థితులలో యూరియాను డంపు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని, గోదామును ఆకస్మిఖంగా తనిఖీచేశారు. ఇప్పటివరకు అమ్మిన యూరియా, ఇతర ఎరువుల వివరాలను, స్టాక్ రిజిస్టర్, ఆన్లైన్ లో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్నంత మేరకే యూరియాను ఇవ్వాలని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అధికారులు తహసిల్దారు కలిసి పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే యూరియాను కేటాయించాలని, అవసరం లేని చోట ఎట్టి పరిస్థితులలో యూరియాను డంప్ చేయవద్దని చెప్పారు.
ఎవరైనా వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియా వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే యూరియాను అమ్మాలని చెప్పారు. యూరియా, ఇతర ఎరువుల సక్రమ సరఫరాకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తనిఖీలు చేయాలని, అలాగే వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియా దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర యూరియా వాడే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఉన్నారు.