24-07-2025 01:31:06 AM
- అజెండా అంశాలను పంపించాలి
- అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు
- స్థానిక ఎన్నికలపై రానున్న స్పష్టత
- ప్రాదేశిక స్థానాల సంఖ్యకు ఆమోదం?
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి):రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 25న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. 25న సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఆరో ఫ్లోర్‌లోని క్యాబినెట్ మీటింగ్ హాలులో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఉంటుందని, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అంతర్గత ఆదేశాలు జారీచేశారు.కేబినెట్ సమావేశం సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించినవి అంశాలు ఏమైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సినవి ఉంటే..
అజెండా అంశాలుగా బుధవారం సాయం త్రం 5 గంటలకల్లా పంపించాలని, ఎలాంటి అంశాలు లేకపోతే.. ఏమీ లేవంటూకూడా సమాచారం అందించాలని సీఎస్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గత క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. గుర్తించిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఖ్యకు ఈ క్యాబినెట్ సమావేశం ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో స్థానిక ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లకు సంబంధించికూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించకపోతే ఏం చేయాలనేదానిపై సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.