08-07-2025 12:40:09 AM
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జులై 10న సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ వెల్లడించారు.
హైదరాబాద్ లిబర్టీలో ని ఆప్ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆప్ రాష్ర్ట నాయకులు బుర్రా రాములు గౌడ్, మహమ్మద్ మజీద్, నర్సింగ్ యమునా గౌడ్, విజయ్ మల్లంగి, శివాజీ, దర్శనం రమేష్, సోహైల్, మౌనిక, ధర్మేంద్ర తివారి తదితరులతో కలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ “చలో సచివాలయం ముట్టడి” గోడ పత్రికను విడుదల చేసారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత, విద్యార్థులపై ఒత్తిడి, ఉపాధ్యాయుల కొరత, నాసిరకం మధ్యాహ్న భోజనం, సకాలంలో ఫీజు రేయింబర్సుమెంట్ అందకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠ శాలల్లో యాజమాన్యాలు లక్షల ఫీజులు వసూలు చేస్తూ నిబంధన లకు విరుద్ధంగా బుక్స్, యూనిఫాంలు అమ్ముతూ పిల్లల తల్లితండ్రులను అప్పుల పాలు చేస్తున్నారని తెలిపారు.
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, విద్యారంగాన్ని బలోపితం చేయాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీకుకోవాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఆప్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జులై 10న సచివాలయం ముట్టడిని విజయవంతం చేయాలని అయన కోరారు.