26-11-2025 12:00:00 AM
గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ ఎన్నికల సందడి
మహబూబాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టి గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను అధికారులు ఇలా ప్రకటించారో లేదో ఔత్సాహిక అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. తమను ఎన్నుకుంటే.. ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ గ్రామాల్లో ప్రచార కార్యక్రమానికి తెర లేపారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే ఔత్సాయిక అభ్యర్థి ఒకరు తమను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి చేపట్టే పనులతో కూడిన భారీ ఫ్లెక్సీని గ్రామంలో ఏర్పాటు చేశాడు. రాజకీయాల కతీతంగా గ్రామ అభివృద్ధి కోసం తాము చేపట్టబోయే పనులను నచ్చితే తమకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలంటూ ఆ ఫ్లెక్సీ లో గ్రామ ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు.
ఇలాగే ఇతర గ్రామాల్లో సైతం రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన కొందరు ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటినుండే ఓటర్లను తమకు ఓటు వేసే విధంగా మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోం ది. దాదాపు రెండేళ్లకు పైగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేయడంతో గ్రామాల్లో రాజకీయ స్తబ్దత నెలకొంది.
ఇటీవల ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నిక లు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశంలో బ్రేక్ వేయడంతో మళ్లీ గ్రామాల్లో స్తబ్దత నెలకొం ది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించడంతో మళ్లీ గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.