సందేశ్‌ఖాలీలో అత్యాచారాలు జరగలేదు!

06-05-2024 12:54:21 AM

సోషల్ మీడియాలో బీజేపీ నాయకుడి వీడియో వైరల్

కోల్‌కత్తా, మే 4: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. టీఎంసీ తాజాగా సందేశ్‌ఖాలీ బ్లాక్ మండల అధ్యక్షుడు గంగాధర్ కైల్ సంబంధించిన 33 నిమిషాల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. సందేశ్‌ఖాలీలో అసలు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరగలేదని, కేవలం బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బలవంతంతోనే కొందరు మహిళలు టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గంగాధర్ కోయల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానికంగా ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వీడియో బయటకు వచ్చిందని తెలుస్తున్నది. ఈ వివాదంపై గంగాధర్ కోయల్ స్పందిస్తూ.. ప్రసార మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిందని, వీడియో చాలా అస్పష్టంగా ఉందని తేల్చిచెప్పారు.