calender_icon.png 31 October, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏను రద్దు చేయండి

30-10-2025 12:00:00 AM

  1. బీసీసీఐకి టీసీఏ డిమాండ్

టీసీఏకు గుర్తింపునివ్వాలన్న గురువారెడ్డి

తెలంగాణలో క్రికెట్‌ను కాపాడాలని పిలుపు

హైదరాబాద్, అక్టోబర్ 29:అవనితీమయంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను తక్షణమే రద్దు చేసి తెలంగాణలో క్రికెట్‌ను కాపాడాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా హెచ్‌సీఎలో అవినీతి జరగని అంశం లేదన్నారు. తెలంగాణలో క్రికెట్‌ను నాశనం చేస్తున్న హెచ్‌సీఏను నిషేధించి..టీసీఏకు గుర్తింపునివ్వాలని కోరారు.

హైదరాబాద్ అవతల ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా,ఎలాంటి క్రికెట్ టోర్నీలు నిర్వహించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అడ్మినిస్ట్రేషన్‌లోనూ, టెండర్ల ప్రక్రియలోనే కాకుండా ఆటగాళ్ల ఎంపికలోనూ అవినీతికి పాల్పడుతూ యువ క్రికెటర్ల భవిష్యత్తుతో హెచ్‌సీఏ ఆడుకుంటోందని మండిపడ్డారు. జాతీయ క్రీడా బిల్లు, బీసీసీఐ రాజ్యాంగం నిబంధనలకు అనుగుణంగా నడుస్తోన్న టీసీఏకు బీసీసీఐ గుర్తింపునివ్వాలని కోరారు.

హెచ్‌సీఏ అవినీతికి సంబంధించిన ఆధారాలతో 33 జిల్లాల్లోనూ స్థానిక పోలీసులకు టీసీఏ ప్రతినిధులు ఫిర్యాదు చేశారని చెప్పారు.ఇటీవలే కొత్త కమిటీలను ప్రకటించిన టీసీఏ నవంబర్ 15 నుంచి తెలంగాణ గోల్డ్ కప్ నిర్వహించబోతున్నట్టు గురువారెడ్డి తెలిపారు. అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కేలా ఐపీఎల్ తరహాలో టోర్నీ జరపబోతున్నట్టు వెల్లడించారు.

అలాగే మహిళా క్రికెట్‌ను సైతం ప్రోత్సహించేలా డిసెంబర్‌లో టీసీఏ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాల్లో క్రికెట్‌ను కిందిస్థాయి నుంచి అభివృద్ది చేసేందుకు బీసీసీఐ టీసీఏను గుర్తించాలని టీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ డా.జి ప్రేమేందర్‌రెడ్డి కోరారు.