calender_icon.png 12 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేనులో గంజాయి సాగు

12-10-2025 01:02:04 AM

  1. ఇంట్లో ఎండు గంజాయి, గంజాయి విత్తనాలు

తనిఖీలకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ అధికారులపై దాడి

సంగారెడ్డి జిల్లా చల్లగిద్ద తండాలో ఘటన

నారాయణఖేడ్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ అధికారులపై తండావాసులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో జరిగింది. చల్లగిద్ద తండావాసులు పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. నమ్మదగ్గ సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు.

తండాకు చెందిన జానకిరాం అనే వ్యక్తి పత్తి చేనులో సాగు చేస్తున్న 64 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తండాలో ఎండు గంజాయి ఉందేమో అనే అనుమానంతో పలు ఇళ్లల్లో తనిఖీలు చేయగా.. వడిత మోహన్ ఇంట్లో నాలుగు కిలోల ఎండు గంజాయి, కిలోన్నర గంజా యి విత్తనాలు పట్టుబడ్డాయి.

మిగిలిన ఇళ్లల్లో తనిఖీలు చేసేందుకు వెళ్తున్న అధికారులను తండావాసులు అడ్డుకుని, వారి మొబైల్ ఫోన్లను లాక్కొని, దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు నారాయ ణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డికి సమాచారం ఇవ్వగా సిర్గాపూర్ పోలీసులను అప్రమత్తం చేసి ఘటన స్థలానికి పంపారు. వారితో పాటు కంగ్టి సీఐ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలం వెళ్లి తండాలో ప్రత్యేక పికెటింగ్ నిర్వహించారు.

తండావాసుల దాడిలో జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శంకర్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై హనుమంతు, అరుణజ్యోతిలకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన జానకిరాం, వడితే మోహన్‌లపై నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు పేర్కొన్నారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.