13-05-2025 10:31:22 PM
పాప మృతి, భార్యాభర్తలుకు తీవ్ర గాయాలు..
వెల్దండ మండలం కొట్ర సమీపంలో ఘటన..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) వెల్దండ మండలం కొట్ర గేటు సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలవగా, వారి పాప మృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలకపల్లి ప్రాంతంలోని గట్టునెల్లికుదురు గ్రామానికి చెందిన కొమ్ముల సాయి, తన భార్య శిరీషలు తమ 8 ఏళ్ల పాప(తేజస్విని) హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
గ్రామంలోని పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు తన భార్య పాపతో కలిసి మంగళవారం హైదరాబాద్ నుండి బయలుదేరాడు. ఈ క్రమంలో కల్వకుర్తి ప్రాంతానికి చెందిన లారీ డీజిల్ లేక ఆగిపోవడంతో అది గమనించక వెనక నుంచి కారు ఢీకొట్టింది. లారీలో భవన నిర్మాణ సామాగ్రి సీకులు, సిమెంటు వంటివి ఉండడంతో సీకులు గుచ్చుకొని తన పాప అక్కడికక్కడే మృత్యువాత పడింది. భార్యాభర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.