14-11-2025 12:36:29 AM
హనుమకొండ జిల్లాలో ఘటన
మహబూబాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): కారు చెట్టుకు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా పరకాల హైవే కొత్తగట్టు శివారులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామానికి చెందిన పార్శ సంపత్, హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొంపల్లి కిషన్, ఆత్మకూరుకు చెందిన చింతపట్ల మురళీకృష్ణ, కామారెడ్డి పల్లి గ్రామానికి చెందిన పోతరాజు వెంకటేష్ కలసి పరకాల నుంచి హనుమకొండకు బుధవారం అర్ధరాత్రి బయలుదేరారు.
అర్ధరాత్రి సమయంలో కొత్తగట్టు శివారులో కారు అతివేగంగా వెళ్తూ రహదారి పక్కన చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పార్శ సంపత్, బొంపల్లి కిషన్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.