18-10-2025 12:00:00 AM
ఓటర్ల జాబితాపై ఫేక్ న్యూస్‌పై ఈసీ కొరడా
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఓటర్ల జాబితాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రముఖ నటీమణులు రకుల్ ప్రీతిసింగ్, సమంత, తమన్నా భాటియా పేర్లతో నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యూసుఫ్‌గూడ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ యాహియా కమల్ మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సినిమా నటీమణుల ఫొటో లతో ఓటర్ కార్డులు సృష్టించి, అవి ఓటరు జాబితాలో ఉన్నాయంటూ సామాజిక మాధ్యమా లలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, ఇతరులకు షేర్ చేయొద్దని కోరారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా తప్పుడు ప్ర చారాలు చేసినా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నా బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.