18-10-2025 12:00:00 AM
-పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలి
-ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
-తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో విద్యుత్ శాఖదే కీలక పాత్ర
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ పని తీరును సమీక్ష
ఖమ్మం, అక్టోబరు 17 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అమలులో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందిన ప్రతి సలహా ఆలోచనలో పెట్టుకున్నామన్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా సబ్ స్టేషన్ల ఏర్పాట్లను పరిశీలించి, ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవీసబ్ స్టేషన్లను మంజూరు చేస్తామన్నారు. జిల్లా పరిధిలో 5 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు చేశామని, ప్రతి యంగ్ ఇండియా స్కూల్ ఒక గ్రామాన్ని తలపిస్తుందని, కొత్త పారిశ్రామిక పార్కులను జిల్లాకు మంజూరు చేశామని, వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ పంపిణీ, రవాణా వ్యవస్థ బలోపేతం చేయాలని అన్నారు.
విద్యుత్ స్తంభాలు, వాటికి వేలాడే తీగలు వదులుగా ఉండటం వల్ల ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని, పొలం బాట కార్యక్రమం కింద ప్రతివారం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ నివారణ చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలన్నారు. వరదల, వర్షాల సమయంలో నీటిలోనే వెళ్లి మన విద్యుత్ సిబ్బంది పనిచేసి రికార్డు సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బంది కృషి ఫలితాన్ని కొద్దిమంది తమ స్వార్థం కోసం చెడగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పదోన్నతులు, బదిలీలు చాలా ఏళ్ల నుంచి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా జరిగాయని, ఇటీవల డైరెక్టర్ల నియామకం కూడా చేశామని అన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెరవేరాలంటే విద్యుత్ శాఖ చాలా కీలకమని, ప్రతి రంగ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కీలకమని అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని, ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికలు రూపొందించి నిబద్ధతతో పని చేస్తుందని తెలిపారు.లైన్ మెన్ నుంచి సీఎండి వరకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తే మంచి ఫలితాలును విద్యుత్ శాఖ సాధిస్తుందని, ఎన్‌పీడీసీఎల్ సిబ్బందికి యూనిఫామ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ అంబులెన్స్ లను, టెక్నిషియన్స్ తో సహా ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన డయల్ 1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం కావాలన్నారు.
డయల్ 1912 కు తానే స్వయంగా ఫోన్ చేసి పరీక్షి స్తానని డిప్యూటీ సీఎం అన్నారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు రావద్దని, వ్యవసాయ విద్యుత్ నూతన కనెక్షన్ దరఖాస్తులను త్వరగా మంజూరు చేయాలని అన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం క్రింద సోలార్ పంప్ సెట్ల ద్వారా ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు ప్రభుత్వం గృహ జ్యోతి క్రింద విడుదల చేస్తున్నదని అన్నారు. విద్యుత్ సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించామని అన్నారు.సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యుత్ శాఖ డైరక్టర్లు వి. మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి. సదర్ లాల్, కె. తిరుమల్ రావు, రాజు చౌహాన్, ఆర్ చరందాస్, ఉమ్మడి జిల్లా ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు అధికారులు పాల్గొన్నారు.