06-05-2025 08:24:50 PM
మునుగోడు (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు వెళ్లిన కూలీ వడదెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మునుగోడు మండలం పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన గుర్రం యాదయ్య(51) రోజులాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం పనులు చేస్తున్న సమయంలో అస్వస్తత గురికావడంతో తోటి కూలీలు ఇంటికి పంపించే సమయంలో కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అతని చికిత్స నిమిత్తం నల్లగొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గుర్రం యాదయ్య మంగళవారం మధ్యాహ్నం సమయంలో మృతిచెందాడు. దీంతో యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ గ్రామస్తులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు.