08-07-2025 12:54:03 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, జూలై 7 :(విజయ క్రాంతి) : ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో సోమవారం జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
విజయోత్సవ సంబరాల కోసం చేపడుతున్న చర్యల గురించి డీఆర్డీఓ సాయగౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయోత్సవ సంబరాల సన్నద్ధత, కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9 వ తేదీన గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు విజయోత్సవ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తూ, రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తుండడంతో పాటు మహిళా సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్ లు, ఆర్టీసీలో అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని గుర్తు చేశారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాలు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తూ అభ్యున్నతి సాధించేలా తోడ్పాటును అందించాలని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం కలెక్టర్ నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.