07-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర బడ్జెట్- 2026 ముహూర్తం ఏ రోజు ఉంటుందనేది ఉత్కంఠ రేపుతున్నది. యేటా ఫిబ్రవరి 1న కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే.. ఈసారి ఆ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందా? లేదా అన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది. ఆరోజు సెలవు కావడం, ఇదేరోజు పాటు ’గురు రవిదాస్ జయంతి’ కూడా రావడంతో కేంద్ర ప్రభుత్వం పద్దు ప్రవేశపెట్టాలా వద్దా అన్న అంశంపై ఊగిసలాడుతున్నది.
ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీనే పద్దు ప్రవేశపెడితే, చరిత్రలో మొదటిసారి ఆదివారం పద్దు ప్రవేశపెట్టిన రోజు అదే అవుతుంది. తద్వారా సరికొత్త రికార్డు నమోదవుతుంది. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఇదే రోజు ప్రవేశపెడుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై బుధవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఏరోజు పద్దు ప్రవేశపెట్టాలన్నది కమిటీ నిర్ణయించనున్నది.
దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అన్ని సజావుగా సాగితే ఈ నెల ౩౧వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకా నున్నాయి. తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే 30 రోజులకు మించి జైలులో ఉంటే సీఎం లేదా మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లు తీసుకురావాలన్న యోచనలోనూ కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం.