09-10-2025 12:48:09 AM
భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన
నష్టంపై కలెక్టర్ల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
నివేదికను కేంద్రానికి అందజేస్తామన్ని సభ్యులు
మెదక్/కామారెడ్డి, అక్టోబర్ 8 (విజయక్రాం తి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ ఎత్తున నష్ట జరిగింది. పంట పొలాలు నీట మునిగాయి, రోడ్లు, కల్వర్టులు, ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా నష్టం వాటిల్లింది. సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై నివేదిక తయారు చేసేందుకు రెండు కేంద్ర బృందాలు బుధవారం క్షేత్రస్థాయి లో పర్యటించాయి.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలానికి చేరుకున్న కేంద్ర బృందానికి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో దెబ్బతిన్న దాస్నమ్మ కుంటను పరిశీలించారు. బిక్నూర్ రోడ్డులో దెబ్బతిన్న రోడ్డు, అంతంపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను, బిబిపేట్ ఆర్ అండ్ బి బ్రిడ్జిని పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకొని జిఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని, కామారెడ్డి ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ క్యాజ్ వే రోడ్డును పరిశీలించారు.
కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు ప్రవాహం కెపాసిటీ ఉండగా పదహారువేల క్యూసెక్కుల నీరు వరద ప్రభావం వచ్చిందని జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం కేంద్ర బృందానికి వివరించారు. దీంతో జిఆర్ కాలనీలో 6 అడుగుల ఎత్తు వరకు నీరు చేరి ఇండ్లలోని వస్తువులు అన్ని చెడిపోయాయని, బూడిద పేరుకుపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపా రు.
తర్వాత వరద నష్టంపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. అనంతరం కొట్టుకుపోయిన లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల ఆర్ అండ్ బి బ్రిడ్జిని, ఎల్లారె డ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద పంట పొలాలను పరిశీలించారు.
నాగిరెడ్డిపేట మండ లం చినూర్వాడి గ్రామం వద్ద నేషనల్ హైవే 765 డి పక్కన వరి పంటను పరిశీలించారు. జిల్లాలో భారీ స్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. మెదక్ మండలంలోని మాక్త భూపతిపూర్, తిమ్మా నగర్, ఆవుసులపల్లి , నిజాంపేట మండలంలోని నందిగామ, చల్మెడ, రామాయంపేట మండలంలోని లఖ్యాతాండ , పార్వతీపురం, హవేలీ ఘనపూర్ మండలంలోని బ్యాతోల్ తిమ్మాయిపల్లి, వన దుర్గ ఏడుపాయల, పిల్లి కొట్టాలలో పర్యటించారు.
ఈ బృందంలో ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, అధికారులతో నేరుగా మాట్లాడారు.
కలెక్టర్ రాహుల్ రాజ్ రోడ్లు, పంట, ప్రాణ నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తెగిపోయిన రోడ్లను, పంటలను, ఆస్తి, ప్రాణ నష్టాన్ని, తెగిపోయిన విద్యుత్ వైర్లను, విద్యుత్ స్తంభాలను, పడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల గురించి, మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో జరిగిన నష్టాన్ని గురించి కలెక్టర్ వివరించారు.
వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రం బృందం పరిశీలించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. పర్యటన అనంతరం కేంద్ర బృందం సభ్యులు ఏడుపాయల ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అక్కడ ఆలయాన్ని ముంచెత్తిన వరదను పరిశీలించారు.