09-10-2025 12:46:18 AM
సుప్రీంకోర్టుకు చేరిన కీలక ఫోరెన్సిక్ నివేదిక
డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి కీలక సాక్ష్యాలు లభించాయన్న సొలిసిటర్ జనరల్
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
అక్టోబర్ 14న తదుపరి విచారణ
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు మెడ కు ఫోరెన్సిక్ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో అత్యంత కీలకమైన డిజిటల్ ఆధారాలు లభ్యమైనట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించా రు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. “కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందింది. డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్‌ఫామ్ నుంచి అత్యంత కీలకమైన ఆధారాలను గుర్తించాం” అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, గత విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, దర్యాప్తు ప్రక్రియకు సంపూర్ణంగా సహకరించాలని ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజా గా ఫోరెన్సిక్ నివేదిక రూపంలో బలమైన సాక్ష్యా లు లభించాయని ప్రభుత్వం పేర్కొనడం ఈ కేసు లో ప్రాధాన్యతను సంతరించుకుంది.