23-09-2025 01:15:55 AM
సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు
నిజామాబాద్ లీగల్ క రెస్పాండెంట్ సెప్టెంబర్ 22: (విజయ క్రాంతి): చట్ట ప్రకారం ఏర్పడిన అధికారిక వ్యవస్థలే వ్యక్తుల హక్కులకు రక్షణగా నిలుస్తాయని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు.వేల్పూర్ మండలం రామన్న పేట్ గ్రామంలో సంస్థ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు.
రామన్న పేట్ గ్రామ అభివృద్ధి కమిటీని రద్దు చేసుకోవడం శుభ సంకేతమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, ఇతర అధికారిక వ్యవస్థలు పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చే వేదికలని ఆయన అన్నారు. విడిసిలచే సామాజిక వెలివేతలు ఆమోదనీయం కావని అవి చట్ట వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు.
శాసనాల ను శాసనసభల ద్వారా రూపొందించుకుని అమలు చేసుకుంటున్నామని వాటికి అనుగుణంగా పౌరుల నడవడిక ఉండాలని జడ్జి ఉదయ్ వివరించారు. డ్రగ్స్ అనే మహమ్మారి పల్లెలలో పరచుకుంటున్నాదని,డ్రగ్స్ కు దూరంగా యువత ఉండాలని అన్నారు. మంచి భవిష్యత్ కోసం యువతరం శ్రమించాలని మత్తు పదార్థాలను దరిచేరనీయరాదనీ ఉద్భోదించారు.
మూఢనమ్మ కాల మాయలో పడి ముప్పు తెచ్చుకోరాదనీ, శాస్రీయ కోణంలో ఆలోచన విధానం ఉండాలని అన్నారు. న్యాయ వివాదాలను ఇరుపక్షాల సమ్మతి మేరకు పరిష్కరించుకునే అత్యుత్తమ వేదిక జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అని, చట్టభద్ధమైన పరిష్కారాలే విలువైనవని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందించడంలో సంస్థ ముందు వరుసలో ఉన్నదని జడ్జి తెలిపారు.
సీనియర్ న్యాయవాదులు బాస రాజేష్వర్, ఆశ నారాయణ మాట్లా డుతూ చట్టం దృష్టిలో అందరు సమానులేనని, అసమానతలు లేని సమాజం, వివక్షతలు లేని సంఘాలు, చట్టానికి అనుకూలంగా నడుచుకునే జీవనశైలి అలవాటు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాము, పంచాయతీ రాజ్ ఆసిసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.