04-12-2024 02:34:11 AM
మోతె రమేశ్ :
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ (బీ క్యాటగిరీ) సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందుకోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లంటేనే దందా.. వ్యాపారం అనేలా పరిస్థితి మారింది.
దీంతో అటు ప్రభుత్వానికి.. ఇటు అధికారులకు చెడ్డపేరు వస్తోంది. మరోవైపు లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. డిమాండ్ ఉండే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లను దక్కించుకోవాలంటే లక్షల రూపాయలు డొనేషన్, ఫీజుల రూపంలో చెల్లించుకోకతప్పడంలేదు.
ఈ దందాపై అడ్మి షన్ల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నా సీట్ల దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది. బీ క్యాటగిరీ సీట్ల భర్తీపై కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికల్లా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
నిబంధనల రూపకల్పనలో బిజీ
మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేసే కొత్త విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఉన్నత విద్యామండలి ప్రణాళికలు రచిస్తోంది. ఫీజుల దందాకు అడ్డుకట్ట వేయాల ని భావిస్తోంది. ఇందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కన్వీనర్ కోటా తరహాలోనే మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేయాలని అనుకుంటుంది.
లేదా నీట్ తరహాలో ఏ, బీ, సీ క్యాటగిరీలుగా విభజించి, ఒక ఫీజు నిర్ణయించి కన్వీనర్ కోటా కింద భర్తీ చేయడం రెండో ప్రతిపాదన. ఇక మూడో ప్రతిపాదనగా ఏపీ లో అమలవుతున్నట్టు కన్వీనర్ ఫీజుకు మూడు రెట్లు నాలుగేండ్లపాటు చెల్లించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిపై ప్రభుత్వ అంగీకారం తీసుకొని అమలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. విద్యార్థికి మెరిట్ కచ్చితంగా ఉండేలా నిబంధనలు రూపొందించనున్నారు.
ప్రస్తుతం నిబంధనలకు నీళ్లు
ప్రస్తుతం రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.15 లక్షల వరకు సీట్లున్నాయి. ఇందులో 70 శాతం సీట్లను ప్రభుత్వమే మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తోంది. మిగిలిన 30 శాతాన్ని బీ-క్యాటగిరీ కోటా కింద ఆయా కాలేజీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఈ సీట్లను నిబంధనల ప్రకారం జేఈఈ మెయిన్/టీజీ ఎప్‌సెట్ ర్యాంకు/ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయిం చాలి.
ప్రభుత్వం నిర్ధేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కొన్ని కాలేజీల్లో ఇంజినీరింగ్ కనిష్ఠ ఫీజు రూ.35 వేల నుంచి 45 వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు ఉంది. కానీ, సీఎస్‌ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి 16 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఎన్నారై కోటా సీట్లను కూడా కొన్ని కాలేజీలు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేసి పారదర్శకంగా మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తీవ్ర కసరత్తు చేస్తోంది.