11-11-2025 07:35:32 PM
సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..
కరీంనగర్ (విజయక్రాంతి): ఈ నెల 15 నుండి 21 వరకు జోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు జరుగు సిపిఐ శత జయంతి ఉత్సవాల రాష్ట్ర ప్రచార జాతాను విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకుంటుందని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా జోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు జరుగు రాష్ట్ర ప్రచార జాతాను విజయవంతం చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, పిట్టల సమ్మయ్య, తదితరులు ఉన్నారు.