23-07-2025 12:01:33 AM
జిల్లా వ్యాప్తంగా 50 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్, జూలై 22(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుండి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన సందర్భంగా 20 రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల సమన్వయంతో సమావేశంలో జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
జిల్లాలో ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలలో, వ్యాపార సముదాయాలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు గాని సంరక్షణ గృహాలకు కానీ చేర్చి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా, కర్షకులుగా కొనసాగరాదని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 84 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు, సంరక్షణ స్థలాలకు చేర్చడం జరిగిందని.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 కేసులను నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం ఓపెన్ స్కూల్ సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, డీసీపీవో కరుణశ్రీ, చైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉప్పలయ్య, కార్మిక, విద్యాశాఖ నుండి రాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, సిబ్బందిపాల్గొన్నారు.