23-10-2025 12:08:09 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని ఒక్కో చిన్నారిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు విక్రయించి.. మొత్తం 86 మందికి పైగా చిన్నారులను విక్రయించడం ద్వారా సుమారు రూ.50 కోట్లు సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ దందా వెనుక భారీగా మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇతరులపై ఉచ్చు బిగించింది. చంచల్‌గూడ మహిళా జైల్‌లో రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారిస్తూ, అక్రమ సంపాదన మూలాలను, నిధుల మళ్లింపు మార్గాలను శోధిస్తోంది. ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, కల్యాణి, సంతోష్, నందిని ప్రస్తుతం చంచల్‌గూడ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.
ఈడీ అధికారులు నేరుగా జైలుకే వెళ్లి వారిని విచారి స్తున్నారు. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్‌కృష్ణను అదుపులోకి తీసుకుని గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. పిల్లల విక్ర యం ద్వారా సంపాదించిన డబ్బును ఎలా, ఎక్కడికి తరలించారు? హవాలా నెట్‌వర్క్‌ను ఎలా నిర్వహించారు? అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
రాజస్థాన్ జంట ఫిర్యాదుతో వెలుగులోకి..
రాజస్థాన్‌కు చెందిన ఓ జంట సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. పిల్లలు లేని జంటలతో పాటు, అబార్షన్ల కోసం వచ్చే మహిళలనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఒక్కో చిన్నారిని విక్రయించేందుకు వారి అవసరాన్ని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఇలా మొత్తం 86 మందికి పైగా చిన్నారులను అక్రమంగా విక్రయించడం ద్వారా సుమారు రూ.50 కోట్లు సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని హవాలా మార్గంలోనే సేకరించి, చట్టం కళ్లుగప్పే ప్రయత్నం చేశారని తేల్చారు. ఈ అక్రమ సంపాదనతో డాక్టర్ నమ్రత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
అంతేకాకుండా, పెద్ద మొత్తంలో నగదును హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గతంలో హైదరా బాద్‌లోని ఐదు ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించి కీలకమైన బ్యాంకు ఖాతాల వివరాలు, రికార్డులను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ వివరాల ఆధారంగా నమ్రత నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.