29-12-2025 01:09:52 AM
పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 28 : జిల్లాలోని వ్యాపారులు ఎవరూ కూడా నిషేధిత మాంజా దారాలను విక్రయించరాదని, కేవలం పర్యావరణ హితమైన కాటన్ దారాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశించారు. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో నిషేధిత నైలాన్, సింథటిక్ మాంజా (చైనా మాంజా) దారాలను అమ్మినా, నిల్వ చేసినా లేదా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ దారాలు చెట్లకు చుట్టుకుని పక్షుల కాళ్లు, రెక్కలు తెగిపోవడానికి, అలాగే పశువులు గాయపడటానికి కారణమవుతున్నాయని తెలిపారు.
గాలిపటాలు ఎగురవేసే సమయంలో వాడే ఈ సింథటిక్ దారాలు వాహనదారుల మెడకు చుట్టుకుని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. జిల్లాలోని వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని, షాపుల లైసెన్సులను రద్దు చేయాలని పోలీసులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
దుకాణాల్లో తనిఖీలు
సిద్దిపేట పట్టణంలోని వివిధ గాలిపటాలు, మాంజా విక్రయ కేంద్రాల్లో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులు ఎవరూ కూడా నిషేధిత చైనా మాంజాను విక్రయించరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు,షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.