21-11-2025 01:25:49 AM
ఎక్స్ వేదికగా శత వసంత జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా శత వసంత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత విద్యాబోధనతో యువత భవితకు బంగారు బాటలు వేసి, ఐఐటీ రామయ్యగా పేరుపొందారని, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన మేధావి చుక్కా రామయ్య మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగంలో ఆయన చేసిన సేవలు, ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం, అని కొనియాడారు.
చుక్కా రామయ్య సేవలు అపారం: కేటీఆర్
విద్యారంగానికి చుక్కా రామయ్య చేసిన సేవలు అపారమైనవని, ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసిన గొప్ప కృషికి ఆయన నిలువెత్తు సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.
100వ జన్మదినం జరుపుకుంటున్న చుక్కా రామయ్యకు విద్యానగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అని కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్క రామయ్య అని కొనియాడారు.
సేవలు వెలకట్టలేనివి: హరీశ్‌రావు
తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి రామయ్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యానగర్‌లోని రామయ్య ఇంటికి వెళ్లి 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, విద్యారంగానికి చుక్కా రామయ్య అందించిన సేవలు వెలగట్టలేనివని పేర్కొన్నారు.
సమాజానికి ఎంతోమంది ఇంజనీర్లను అందించిన వ్యక్తి ఐఐటీ రామయ్య అని స్పష్టం చేశారు. రామయ్య సిద్దిపేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసినప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉన్నదని గుర్తు చేసుకున్నారు.